హైదరాబాద్: గురుకుల్ ట్రస్టు భూమిలో ఉన్న నాగార్జునకి చెందిన ఎన్
కన్వెన్షన్ సెంటర్ నుంచి బయిటపడటానికి దిల్ రాజు సాయిం చేస్తున్నాడని
ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది. తెలంగాణా ప్రాంత ముఖ్యమంత్రి కేసీఆర్
తో ఆయన మాట్లాడనున్నారని చెప్పుకుంటున్నారు. రెండు రోజుల క్రితం విడుదల
అయిన ఆటోనగర్ సూర్య చిత్రం విడుదలకు సైతం దిల్ రాజు సాయిం చేసారని
చెప్తున్నారు. దిల్ రాజు, నాగార్జున మంచి స్నేహితులు కావటంతో ఈ సహాయం
చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఇది నిజమా ...కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో
వినపడుతున్న రూమరా అనేది తెలియాల్సి ఉంది.
ఇక హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) అధికారులు దృష్టి సారించారు.
ఇక్కడ పురాతన చెరువు ఒకటి ఉంది. ఈ చెరువు స్థలం కూడా సినీ నటుని భూమిలో
కలిసిందని కొన్నేళ్ల కిందటే అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ
చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్) నిర్ధరించేందుకు అధికారులు
సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆక్రమణ ఉందని తేలితే నోటీసు ఇచ్చి వీటిని
తొలగించడానికి గ్రేటర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు
శుక్రవారం అయ్యప్ప సొసైటీలోని 11 ఆస్తులను సీజ్ చేశారు. కార్యక్రమాన్ని
కొనసాగించాలని నిర్ణయించారు.
అయ్యప్ప సొసైటీలోని పెద్దల అధీనంలో ఉన్న భూములను ఒక్కోదానిని స్వాధీనం
చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా శుక్రవారం జీహెచ్‌ఎంసీ
అధికారుల నేతృత్వంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ఆఫ్ ల్యాండ్
రికార్డ్స్ విభాగాలకు చెందిన అధికారులు హైటెక్ సిటీకి దగ్గరలోని
తుమ్మిడికుంట చెరువు సర్వేను మొదలుపెట్టారు.
ఎన్ కన్వెన్షన్ వివాదం: నాగ్ కి ఆ నిర్మాత సాయిం?
మొత్తం చెరువు విస్తీర్ణం, ప్రస్తుతం ఎంత మేరకు ఉందనే అంశాలను అధ్యయనం చేసి
ఆ తర్వాత ఎఫ్‌టీఎల్‌ను మార్కింగ్ చేయనున్నారు. శనివారం నాటికి సర్వే
పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. చెరువు చుట్టు పక్కల బడాబాబులు పెద్ద
ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఇప్పుడు మళ్లీ అధికారులు కొత్తగా సర్వే
మొదలుపెట్టడంతో వారిలో ఆందోళన మొదలైంది. ముందుగా రెవెన్యూ, ఇరిగేషన్
అధికారులు ఎఫ్‌టీఎల్‌ను నిర్థారించనున్నారు.
ఆ తర్వాత అక్కడి వరకూ మార్కింగ్ చేసిన తర్వాత పూర్తి వివరాలను బల్దియా
అధికారులకు నివేదించనున్నారు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత అక్రమ
నిర్మాణాలకు నోటీసులు జారీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. దీంతో
ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు
చెబుతున్నారు.
మూడింతలు అధికంగా నీరు, విద్యుత్ ఛార్జీల విధింపు: ఇప్పటికే అయ్యప్ప
సొసైటీలో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారి నుంచి భారీ ఎత్తున జరిమానా
వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యుత్తు, మురుగు, తాగునీటి
ఛార్జీలను కూడా మూడు రెట్లు అధికంగా వసూలు చేయాలని సంబంధిత శాఖలకు
జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. గురుకుల్ ట్రస్టు భూముల్లోకి
ప్రవేశించే ప్రధాన మార్గాల్లోని 20 ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా ఫ్లెక్సీలను
సైతం ఏర్పాటు చేశారు.
ప్రతి స్వాగత ద్వారం వద్దా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ
610 కట్టడాలు నిర్మించగా ప్రతి ఒక్కదానిపైనా అక్రమ నిర్మాణమని ఎర్ర రంగు
అక్షరాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు రాయించడం ప్రారంభించారు. ఇప్పటికే
తొలగించిన ఆక్రమ కట్టడాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. భవిష్యత్తులో
ఎటువంటి విద్యుత్తు, మంచినీటి కనెక్షన్లు మంజూరు చేయవద్దని సంబంధిత శాఖల
అధికారులకు లేఖలు రాశారు.
గురుకల్ ట్రస్టు భూముల్లో భవిష్యత్తులో ఎటువంటి అక్రమ నిర్మాణాలు
చేపట్టకుండా నివారించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు
చేపట్టారు. పోలీస్, జలమండలి, విద్యుత్తు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా
కలెక్టర్లతో సమన్వయం ఏర్పర్చుకొని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు
సిద్ధమవుతున్నారు. మరోవైపు అక్రమ కట్టడాలను నిర్మించినా, కొనుగోలు చేసినా
వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ విస్తృత ప్రచారం చేపడుతున్నారు.
అక్రమ నిర్మాణాలు చేపడితే జీహెచ్‌ఎంసీనే క్రిమినల్ కేసులు నమోదు
చేయవచ్చని, మూడేళ్ల పాటు కస్టడీకి తీసుకుసేందుకు వీలుందనే అంశాన్ని
ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. గురుకుల్ ట్రస్టు భూముల్లోని ప్రతిఇల్లూ
అక్రమ నిర్మాణమేననే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు అధికారులు చర్యలు
ప్రారంభించారు.
0 comments:
Post a Comment