ముంబై: 24ఏళ్ల పాటు తనకు మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు
తెలుపుతూ తన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఉద్వేగంగా
ప్రసంగించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ సందర్భంగా తనకు
సహకరించిన తన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తను ఈ స్థాయికి
వచ్చేందుకు తన తండ్రి ప్రోత్సాహమే కారణమని ఆయన అన్నారు. ప్రస్తుతం అతను
లేకపోవడం బాధగా ఉందని చెప్పారు.
తన తల్లి తన కోసం ఎంతో చేసిందని. తన ప్రార్థనలే తనను ఈ స్థాయికి
చేరుకోవడానికి సహకరించాయని మాస్టర్ అన్నారు. తన క్రికెట్ జీవితం సాఫీగా
కొనసాగడానికి తన భార్య అంజలి ప్రోత్సాహం మరువలేనిదని ఆయన అన్నారు. తను ఒక
వైద్యురాలని అయితే అద్భుతమైన వైద్య వృత్తిని వదిలి, తన కోసం కుటుంబ
బాధ్యలను చూసుకుంటానని చెప్పిందని తెలిపారు. తన సహకారం లేకపోతే ఇన్ని
రోజులు ఆటను కొనసాగించేవాడిని కాదని ఆయన అన్నారు. తనకు వజ్రాల్లాంటి ఇద్దరు
చిన్నారులున్నారని... వారే కూతురు సారా, కుమారుడు అర్జున్ అని చెప్పారు.
అక్క బ్యాట్ ఇచ్చింది, భార్య త్యాగం: ఉద్వేగంతో సచిన్
కొన్ని సందర్భాల్లో వారి బర్త్ డే లాంటి కార్యక్రమాలకు
హాజరుకాలేకపోయేవాడినని ఆయన అన్నారు. సచిన్ కుటుంబం గురించి మాట్లాడుతన్న
సమయంలో ఉద్వేగానికి గురైన అంజలి కన్నీళ్లు పెట్టుకుంది. తన సోదరుడు అజిత్
టెండూల్కర్ ప్రోత్సాహం లేనిదే తాను క్రికెట్‌లో ఇంతగా రాణించేవాడినే కాదని
అన్నారు. తన క్రికెట్ ఆటను కొనసాగించేందుకు ఆయన ఎంతో సహకరించారని అన్నారు.
తనకు మొదటి క్రికెట్ బ్యాట్ తన సోదరి ఇచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
22 గజాల పిచ్ లో 24ఏళ్ళపాటు ఆనందంగా గడిపానని మాస్టర్ సచిన్ అన్నారు.
చిన్నతనం నుంచి కష్టపడడాన్ని అలవాటు చేసుకున్నానని ఈ సందర్భంగా ఆయన
తెలిపారు. 11ఏళ్లకే తను క్రికెట్ ఆడటం ప్రారంభించానని మాస్టర్ అన్నారు. తను
క్రికెట్‌లో ఇంత ఘనతను సాధించేందుకు తన గురువు అచ్రేకర్ ప్రోత్సాహమే
కారణమని ఆయన అన్నారు. అచ్రేకర్ ఎప్పుడూ తన మ్యాచును టీవీలో చూసేవారని, తన
చివరి మ్యాచ్ కావడంతో ప్రత్యక్షంగా చూసేందుకు ఇక్కడికి వచ్చారని మాస్టర్
తెలిపారు.
విజయాల కోసం అడ్డదారులు వెతుక్కోవద్దన్న నియమాలను పాటించానని ఆయన అన్నారు.
తనకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందించడంలో ముందున్న ముంబై క్రికెట్
అసోసియేషన్, భారత నియంత్రణ మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన
చెప్పారు. కుటుంబానికి దూరంగా ఉన్న సమయంలో తనతోపాటు ఉన్న ఆటగాళ్లనే కుటుంబ
సభ్యులుగా భావించేవాడినని ఆయన అన్నారు. మ్యాచ్ జరిగిన వాంఖేడే స్టేడియంలో
ఉన్న రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్‌లను చూపిస్తూ ఇలాంటి
మంచి స్నేహితులు తనకున్నారని ఆయన తెలిపారు.
తనకు కొందరు భారత సీనియర్లతో ఆడే అవకాశం దక్కలేదని అన్నారు. తనకు
24ఏళ్లపాటు సహకరించిన బిసిసిఐకి ఈ సందర్భంగా సచిన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే
తన చివరి ప్రసంగం కాబట్టి సుదీర్ఘంగా మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. తన
ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన వైద్యులు, తన మేనేజర్లకు ఆయన కృతజ్ఞతలు
తెలిపారు.
మాస్టర్ సందేశం
భారత క్రికెట్ సభ్యులతో ఈ సందర్భంగా ఓ సందేశాన్ని ఇవ్వదలచుకున్నాని
తెలుపుతూ.. భారత క్రికెట్‌లో తామూ భాగస్వాములవుతున్నందుకు ఆటగాళ్లందరూ
గర్వపడాలని ఆయన అన్నారు. సరైన విలువలతో దేశానికి సేవ చేయాలని ఆయన ఈ
సందర్భంగా ఆటగాళ్లను కోరారు. ఆటగాళ్లు ఎప్పుడూ క్రీడా స్ఫూర్తిని కలిగి
ఉండాలని అన్నారు. కొంత ఉద్వేగంతో తన కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా..
ఆటగాళ్లందరికి ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పిన తర్వాత గుడ్‌బై అని తన
ప్రసంగాన్ని ముగించారు మాస్టర్.
0 comments:
Post a Comment