Monday 30 September 2013

రాజీనామా సిఎం ఇష్టం, టీపై వెనక్కి వెళ్లం: సందీప్ దీక్షిత్

రాజీనామా సిఎం ఇష్టం, టీపై వెనక్కి వెళ్లం: సందీప్ దీక్షిత్ 

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు కట్టుబడి ఉందనే విషయం మరోసారి వెల్లడైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అన్నారు. ఆంటోనీ కమిటీ ఐదారు విషయాలపై అభిప్రాయ సేకరణ జరుపుతోందని, వాటిని బిల్లులో పొందుపరుస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
 సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల రాజీనామాలను స్పీకర్ ఇంకా ఆమోదించలేదని ఆయన చెప్పారు. తెలంగాణపై సిడబ్ల్యుసి తీర్మానాన్ని చించేయాలనేది సీమాంధ్ర నేతల వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సిడబ్ల్యుసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. రాజీనామా అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, ముఖ్యమంత్రి రాజీనామా కిరణ్ కుమార్ రెడ్డికీ పార్టీ అధిష్టానానికీ మధ్య వ్యవహారమని ఆయన అన్నారు. రాష్ట్రమంత్రి విశ్వరూప్ రాజీనామాపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. అది రాష్ట్రానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. ఇదిలావుంటే, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ ఢిల్లీకి ఆహ్వానించారు. ఆయన రేపు మంగళవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపించాలని అడిగే అవకాశం ఉంది

0 comments:

Post a Comment