Monday 30 September 2013

యూటర్న్ కాదు, హైదరాబాదులో సమైక్య సభ: జగన్

యూటర్న్ కాదు, హైదరాబాదులో సమైక్య సభ: జగన్  

హైదరాబాద్: సమైక్య శంఖారావం పేరుతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 15 -20 తేదీల మధ్య హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చెప్పారు. రాష్ట్ర సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం ప్రతిపాదించడానికి ప్రత్యేకంగా శాసనసభను సమావేశపరచాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించిన తర్వాత సోమవారం సాయంత్రం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 
తాను యూ టర్న్ తీసుకోలేదని, అలా అంటున్నవాళ్లు తమ పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాన్ని చదవాలని, హోం శాఖకు ఇచ్చిన లేఖను చూడాలని ఆయన అన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని తాము కోరామని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ నోట్ తయారు కావడానికి ముందే శాసనసభ సమావేశాలను ఏర్పాటు సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేయాలని, దానివల్ల రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం కాస్తో కూస్తో వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. 
కేబినెట్ నోట్ తయారైన తర్వాత, బిల్లు ముసాయిదా సిద్ధమైన తర్వాత శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఫలితం ఉండదని ఆయన అన్నారు. యూటర్న్ కాదు, హైదరాబాదులో సమైక్య సభ: జగన్ వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎం, మజ్లీస్ పార్టీలు మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నాయని, మిగతా పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తండ్రి బాధ్యతను నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు.
 పిల్లలిద్దరికీ న్యాయం చేయలేనప్పుడు యధావిధిగా ఉంచాలని ఆయన అన్నారు. పిల్లలు కొట్టుకునే పరిస్థితి లేకుండా చూడాలని ఆయన అన్నారు. ఓట్లు సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెసు అనుకుంటోందని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే బాధేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రం సమిష్టిగా ఉంటేనే నీళ్లు రాని పరిస్థితి ఉందని, రాష్ట్రాన్ని విడగొడితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్లు ఉండవని, కృష్ణా పరీవాహక ప్రాంతంలోని జిల్లాలు కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే పోలవరం ప్రాజెక్టుకు నీల్లుి ఎక్కడి నుంచి ఇస్తారని ఆయన అడిగారు. యాభై శాతం ఆదాయం హైదరాబాదు నుంచి వస్తుందని, హైదరాబాదును తమకు కాకుండా చూస్తే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఉంటుందని, పిల్లలకు ఉద్యోగాలు రాని పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. 
 
 
 తెలంగాణ సోదరులకు నాది భరోసా.. సమైక్యమంటే కోస్తాంధ్ర, రాయలసీమనే కాదు తెలంగాణ కూడా అని, తమకు ఆ మూడు ప్రాంతాలు కావాలని ఆయన అన్నారు. తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తానని తాను తెలంగాణ సోదరులకు హామీ ఇస్తున్నానని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును చేపడితే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తాను యూటర్న్ తీసుకున్నానని అంటుంటే తన మనసుకు బాధేస్తోందని ఆయన అన్నారు. యాభై శాతం మంది ప్రజలు రోడ్లెక్కితే కనిపించడం లేదా అని ఆయన అడిగారు. రాష్ట్రాన్ని విభజిస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఏం అన్యాయం జరుగుతుందో, తనకూ అదే అన్యాయం జరుగుతుందని, కానీ అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడకపోవడం సరి కాదని, రాజకీయాలు నిజాయితీగా ఉండాలని ఆయన అన్నారు.

0 comments:

Post a Comment