Friday, 11 October 2013

ప్రొడక్షన్ మేనేజర్లను కూడా నిర్మాతలను చేసిన ఘనత శ్రీహరిదే!


ksrసినీ నటుడు శ్రీహరి భౌతికకాయం గురువారం ఉదయం ఆయన నివాసానికి చేరింది. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు. శ్రీహరి అంత్యక్రియలు  బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. తెలుగు తెర నటుడు శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు వంశీ పైడిపల్లి కంటతడి పెట్టారు. శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించిన వారిలో కేంద్ర మంత్రి చిరంజీవి, రాంచరణ్ తేజ, దిల్ రాజు, నల్లమల్లపు బుజ్జి,  పరుచూరి గోపాలకృష్ణ, సుమన్, కృష్ణం రాజు, తరుణ్, వందేమాతరం శ్రీనివాస్, జగపతిబాబు, ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వి. హనుమంతరావు తదితరులు ఉన్నారు. హిందీ చిత్రం రాంబో రాజ్ కుమార్ షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన శ్రీహరి గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు.
తమ అభిమాన నటుడు శ్రీహరిని కడసారి చూపు చేసేందుకు ఆయన నివాసానికి అభిమానులు పోటెత్తారు. శ్రీహరి భౌతికకాయాన్ని కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం జూబ్లీహిల్స్కు చేరుకుంది. దాంతో శ్రీహరిని చూసేందుకు అభిమానులు వెల్లువెత్తుతున్నారు. రియల్ స్టార్ అమర్ హై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
శ్రీహరిని అంజలి ఘటించేందుకు సినీ ప్రముఖులే కాకుండా, రాజకీయ నేతలు, అభిమానులు ఆయన ఇంటికి తరలి వచ్చారు.  మంచితనానికి మారుపేరు శ్రీహరి అన్న అంటూ అభిమానులు శ్రీహరి భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. రియల్ స్టార్ ఇక లేరు అనేది జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలిపారు. శ్రీహరి లేని లోటును పూడ్చలేమన్నారు.
sr11999… శ్రీహరి హీరోగా ‘పోలీస్’ సినిమా ప్రకటించగానే చిత్రసీమలోని చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానించుకున్నారు. బాడీ బిల్డర్‌లా ఉంటూ విలన్ వేషాలేసుకునే శ్రీహరి హీరో రోల్‌లో ఫిట్ అవుతాడా? ఇన్ని సందేహాల మధ్యలోనే ‘పోలీస్’ సినిమా చకచకా పూర్తి కావడం, విడుదల కావడం, నిర్మాతకు ఆర్థికంగా లాభాలు రావడం… ఇవన్నీ జరిగిపోయాయి. ఏదో ఫ్లూక్ హిట్ అనుకున్నారు మొదట. తర్వాత వచ్చిన ‘దేవా’, ‘సాంబయ్య’ హిట్లతో శ్రీహరి హీరోగా హ్యాట్రిక్ సాధించారు. దాంతో శ్రీహరి స్టామినా ఏంటో అటు బాక్సాఫీస్‌కి, ఇటు పరిశ్రమకీ అవగతమైంది. కంఫర్టబుల్ బడ్జెట్‌లో శ్రీహరితో సినిమా చేస్తే, ఆ నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ ఖాయమనే బ్రాండ్ తెచ్చుకున్నారాయన.
 హీరోగా తనకొచ్చిన బూమ్‌ని సద్వినియోగం చేసుకోవడానికి శ్రీహరి ప్రతి క్షణం తపించారు. దాదాపుగా సినిమాలు తీయడం మానుకున్న నిర్మాత జయకృష్ణను పిలిచి మరీ డేట్లు ఇచ్చారు. ఒకప్పుడు స్టార్ ఫైనాన్షియర్‌గా వెలుగొంది, తెరమరుగైన వాళ్లకి అడక్కుండానే కాల్షీట్లు కేటాయించారు. అలాగే బాగా చితికిపోయిన నిర్మాతలను పిలిచి మరీ అవకాశాలిచ్చారు. తనను నమ్ముకున్న స్నేహితులను, ప్రొడక్షన్ మేనేజర్లను కూడా నిర్మాతలను చేసిన ఘనత శ్రీహరిదే.
sr2ఇప్పుడు పరిశ్రమలో అగ్రనిర్మాతగా వెలుగొందుతున్న బెల్లంకొండ సురేష్‌కి ‘సాంబయ్య’ సినిమాతో లైఫ్ ఇచ్చింది శ్రీహరే. ఒక్క నిర్మాతలనే కాదు ఎందరో కొత్త దర్శకులకు, సాంకేతిక నిపుణులకు బంగారు భవిష్యత్తుని ప్రసాదించారు. అయిదారేళ్ల పాటు హీరోగా ఆయన హవా సాగింది. తను ఎదుగుతూ, తనను నమ్ముకున్న వారిని కూడా ఎదిగేలా చేయడం శ్రీహరి గొప్పతనం. అందుకే శ్రీహరిని రియల్ స్టార్ అనేది.
 ఫైటింగ్ స్పిరిట్: అసలు శ్రీహరి కెరీర్ ఓ చిన్న ఫైటర్‌గా మొదలైంది. ఆ ఫైటింగ్ స్పిరిట్‌తోనే తన కెరీర్‌ని శక్తివంతంగా నిర్మించుకున్నారాయన. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మనాయుడు’ సినిమాతో శ్రీహరి నటప్రస్థానం మొదలైంది. తన వైవిధ్యమైన నటనతో, వ్యక్తిత్వంతో, స్నేహంతో అందరితో మంచి అనిపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. తనకొచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని శ్రీహరి సద్వినియోగం చేసుకున్నారు. సైడ్ విలన్ పాత్ర అయినా, మెయిన్ విలన్ అయినా తనదైన డిక్షన్ ఆఫ్ డైలాగ్స్‌తో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకుల్ని చాలా తొందరగానే ఆకట్టుకోగలిగారు. ఆయనలో మంచి కామెడీ టింజ్ ఉందని హలో బ్రదర్, అల్లరి ప్రేమికుడు, బావగారు బాగున్నారా లాంటి సినిమాలు నిరూపించాయి. ‘అల్లరి ప్రేమికుడు’లో ‘ఈ హరి బీరు కొట్టి బరిలోకి దిగాడూ అంటే… ఎవడైనాసరే హరీ అనాల్సిందే’ అనే డైలాగ్‌ని ఆయన చెప్పిన విధానం బాగా  ఆకట్టుకుంది.
sr3  హయ్యెస్ట్ పెయిడ్ కేరెక్టర్ ఆర్టిస్ట్: ‘పోలీస్’ (1999) చిత్రంతో హీరోగా మారిన శ్రీహరి, మొత్తం 28 సినిమాల్లో హీరోగా చేశారు. 2005లో ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’తో కేరెక్టర్ ఆర్టిస్టుగా మారి, ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్రీహరి అన్న పాత్ర పోషిస్తే, ఆ సినిమా విజయం తథ్యమనే సెంటిమెంట్ కూడా పరిశ్రమలో ఏర్పడింది. ఆయన కీలకపాత్ర పోషించిన ఢీ, మగధీర, బృందావనం లాంటి చిత్రాలు ఘనవిజయాల్ని సాధించాయి. దాంతో హయ్యెస్ట్ పెయిడ్ కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా వెలుగొందారు. మధ్య మధ్యలో హీరోగా కొన్ని సినిమాలు కూడా చేశారు. ఏదో రొడ్డ కొట్టుడు తరహా పాత్రలకు కాకుండా వైవిధ్యానికే పెద్దపీట వేసేవారాయన. ఏం చేసినా తనదైన మార్కు చూపడానికి ప్రయత్నించేవారు. హీరోగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సమయంలోనే కేరెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ కావడమనేది నిజంగా సాహసమే. హీరో అంటే ఆరు పాటలు, ఐదు ఫైట్లు అన్న ధోరణిలో కాకుండా శక్తివంతమైన పాత్రలతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చని శ్రీహరి చాలామందికి ఓ కొత్త మార్గం చూపించారు. హీరోగా చేస్తున్న సమయంలో హీరోయిన్‌కి అన్నగా చేయాలనుకోవడం శ్రీహరి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. అదే ఆయన కెరీర్‌ని మరోవైపు టర్న్ చేసింది. ‘మగధీర’లో షేర్‌ఖాన్‌గా ఆయన చూపించిన అభినయం ఆ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
sr పోలీస్ అంటే ప్రేమ: పోలీస్ పాత్రల్లో కూడా శ్రీహరి బాగా రాణించారు. ఆయన చేసిన పోలీసు పాత్రలన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. నిజానికి ఆయన ఒకప్పుడు పోలీస్ కావాలనుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎస్.ఐ. పోస్టింగ్ కూడా సాధించి, చివరకు వద్దనుకున్నారు. సమాజానికి పోలీసు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఓ గొప్ప సినిమా చేయాలని కలలు కన్నారు. అందుకోసం ఓ రచయితతో స్క్రిప్టు కూడా సిద్ధం చేయిస్తున్నారు.
 ఆదర్శ దాంపత్యం: సినిమాల్లో నటునిగా ఎదుగుతున్న సమయంలోనే నృత్యతార డిస్కో శాంతితో పరిచయం ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. శాంతితో ఆయన దాంపత్యం ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉండేవారు. వీరికి ఇద్దరు మగపిల్లలు.
27 ఏళ్లు… 97 సినిమాలు: 27 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 97 సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ చిత్రాల్లో కూడా యాక్ట్ చేశారు. యమధర్మరాజు లాంటి పౌరాణిక పాత్రల్లో కూడా రాణించారు. ఇటీవల విడుదలైన ‘ఆది శంకర’లో గోవింద భగవత్పాదగా శ్రీహరి తన అభినయంతో ఆకట్టుకున్నారు. ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా, ప్రేయసి రావే, సముద్రం, శ్రీరాములయ్య, ప్రేమంటే ఇదేరా, సూర్యుడు, అల్లుడా మజాకా, తాజ్‌మహల్, హలో బ్రదర్, భద్రాచలం, అయోధ్య రామయ్య, విజయరామరాజు, హనుమంతు, కుబుసం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర, ఢీ, కింగ్, బృందావనం… తదితర చిత్రాలు శ్రీహరి అభినయ సామర్థ్యానికి నిలువుటద్దాలుగా నిలుస్తాయి. నిర్మాతగా ‘హనుమంతు’లాంటి సినిమాలు కూడా చేశారు. తెలుగులో ఆయన ఆఖరి చిత్రాలు శివకేశవ్, వీకెండ్‌లవ్. ప్రభుదేవా దర్శకత్వంలో ప్రస్తుతం హిందీలో తయారవుతున్న ‘రాంబో రాజ్‌కుమార్’లో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ఇదే ఆయనకు తొలి హిందీ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ కోసం ముంబైలో ఉన్నప్పుడే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
ఎప్పుడూ పర్‌ఫెక్ట్ బాడీతో ఫిట్‌గా కనిపించే శ్రీహరి గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైనట్టుగా, బాగా చిక్కి కనిపిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై అప్పటి నుంచే సందేహాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా శ్రీహరి మరణం చిత్ర పరిశ్రమకు రియల్‌గా లాసే. కొన్ని పాత్రల్లో ఆయనకు రీప్లేస్‌మెంటే లేదు. ఇది సత్యం.
ప్రముఖుల నివాళి
 మా సంస్థలో శివయ్య, తాజ్‌మహల్… ఇలా పలు చిత్రాల్లో నటించాడు శ్రీహరి. వెంకటేష్ కాంబినేషన్‌లో కూడా పలు చిత్రాలు చేశాడు. నాయుడుగారూ అంటూ ఎంతో అభిమానంగా పిలుస్తాడు. నన్ను ‘గాడ్‌ఫాదర్’ అంటుంటాడు. కొత్త నటీనటులను ప్రోత్సహించే మీలాంటి నిర్మాతలు అరుదని అనేవాడు. ఓ మంచి ఆత్మీయుణ్ణి కోల్పోయాను.
 - డా. డి.రామానాయుడు
 శ్రీహరితో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ముఠా మేస్త్రీ, బావగారు బాగున్నారా తదితర చిత్రాల్లో కలిసి నటించాం. నేను చెన్నయ్‌లో ఉన్నప్పుడు.. షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే శ్రీహరి నాతోనే ఉండేవాడు. మొదట్లో తను చిన్న చిన్న పాత్రలు చేసినా, ఆ తర్వాత స్వశక్తితో ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు.  శ్రీహరి ప్రతిభకు అద్దం పట్టే చిత్రాల్లో ‘మగధీర’ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన మృతి నాకు తీరని లోటే.
 - డా. చిరంజీవి
 శ్రీహరిని దాసరిగారి దగ్గరికి తీసుకెళ్లింది నేనే. కష్ట సుఖాలను చెప్పుకునేంత అనుబంధం మా మధ్య ఉంది. నా కుటుంబ సభ్యుడు లాంటివాడు. స్వశక్తితో పైకొచ్చిన సహజ నటుడు. చిత్రపరిశ్రమకు ఓ గొప్ప నటుడు దూరమయ్యాడు. తన మరణవార్త చాలా కలచివేసింది.
 - డా. మోహన్‌బాబు
 శ్రీహరిగారి కాంబినేషన్‌లో ‘ఢీ’ చిత్రం చేశాను. ఆ టైంలో యాక్టింగ్ గురించి ఆయన ఎన్నో సలహాలిచ్చేవారు. ఆయన్ను అన్నా అని పిలవడం అలవాటు. ఓ మంచి సోదరుణ్ణి కోల్పోయాను.
  – మంచు విష్ణు
 శ్రీహరి కాంబినేషన్‌లో చాలా సినిమాలు చేశాను. మంచి నటుడు మాత్రమే కాదు… మంచి వ్యక్తి కూడా. నాకున్న ఆత్యంత ఆప్తమిత్రుల్లో ఆయన ఒకరు. శ్రీహరి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను.
  – సుమన్
 నాలుగు రోజుల క్రితం శ్రీహరికి ఫోన్ చేస్తే, ‘ముంబైలో ఉన్నాను. వచ్చిన తరువాత కలుద్దాం’ అన్నాడు. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు’. మా అనుబంధం 22 ఏళ్లుగా కొనసాగుతోంది. హీరోగా రాణించేందుకు తను, దర్శకుడిగా ఎదిగేందుకు నేను  ఇద్దరం చాలా కష్టపడ్డాం. జీవితానికి  ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని  ప్రతి క్షణం ఆ లక్ష్యం దిశగా  నడిచిన  మనిషి శ్రీహరి. ‘శ్రీరాములయ్య’ సినిమాలో శ్రీహరికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు లభించింది. ‘భద్రాచలం’ సినిమాను ఒక సవాల్‌గా తీసుకొని చేశాము. శ్రీహరి చాలా అరుదైన మనిషి, అరుదైన నటుడు కూడా. ఎవరైనా బాధలో ఉన్నారంటే వెంటనే చలించిపోతాడు. వీలైనంత వరకు సహాయం చేస్తాడు. ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోయాను.
శ్రీహరి చిన్నతనం…
‘చిన్నతనంలో మాతో కలిసి మెలిసి తిరిగేవాడు. ఆటపాటలంటే మక్కువ. ఏడో తరగతి వరకు ఇక్కడే చదివాడు. ఎంత అగ్రహీరో అయినా మా స్నేహాన్ని మరచిపోలేదు’ అంటూ పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలోని శ్రీహరి సహవిద్యార్థులు వివరించారు. సినీనటుడు శ్రీహరి ఆకస్మిక మరణంతో ఆయన స్వగ్రామం యలమర్రులో విషాదఛాయలు అలముకున్నాయి. స్నేహానికి ఎంతగానో విలువనిచ్చేవాడని గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వాకా చిన్న సత్యనారాయణ తెలిపారు.7వ తరగతి వరకు ఇక్కడే చదివాడు…సినీనటుడు శ్రీహరి 7వ తరగతి వరకు యలమర్రు గ్రామంలో ఉన్న పాఠశాలలో చదువుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు రఘుముద్రి సత్యనారాయణ, లక్ష్మి. శ్రీహరికి ఇద్దరు సోదరులు . అన్నయ్య శ్రీనివాసరావు హైదరాబాద్‌లోనే ట్రావెల్స్ యజమానిగా, శ్రీహరి సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటారు. తమ్ముడు శ్రీధర్ సినిమాల్లో నటిస్తున్నారు.శ్రీహరి తల్లిదండ్రులు యలమర్రు గ్రామంలోనే వ్యవసాయం చేసేవారు. 30 ఏళ్లక్రితం ఇక్కడ్నుంచి  హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీహరి పెదనాన్న వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లిపోయారు. అప్పట్నుంచి గ్రామంతో ఆ కుటుంబానికి పెద్దగా సంబంధాలు లేవు. ఆయన మిగిలిన చదువులన్నీ హైదరాబాద్‌లోనే కొనసాగాయని బంధువులు చెబుతున్నారు. శ్రీహరి పాఠశాలలో చదివేటప్పుడు క్రీడలంటే ఎంతో మక్కువతో ఉండేవారని, ఆయనతో చదువుకున్నవారు పేర్కొంటున్నారు. ఏటా గంగానమ్మ జాతరకు వస్తాడు…
గ్రామంలో జరిగే గంగానమ్మ జాతరకు భార్య, కుమారులతో ఏటా వచ్చేవాడని పేర్కొంటున్నారు. గ్రామదేవత గంగానమ్మ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని బంధువులు అంటున్నారు. ఆరు నెలల క్రితం గంగానమ్మ అమ్మవారికి రూ.లక్షతో వెండి కిరీటం, ఆభరణాలు చేయించారని తెలిపారు. గంగానమ్మ గుడిని తన సొంత ఖర్చులతో కట్టిస్తానని గ్రామపెద్దలకు హామీ ఇచ్చారని వివరించారు.
వచ్చినప్పుడల్లా కలిసేవాడు…
యలమర్రు గ్రామానికి వచ్చినప్పుడల్లా తన బంధువులతో పాటు సహవిద్యార్థులమైన తమను కలిసి వెళ్లేవాడని శ్రీహరి బాల్యస్నేహితులు వాకా చిన్నసత్యనారాయణ, సుంకర వెంకటేశ్వరరావు, వల్లభనేని నరసింహారావు, అట్లూరి శివాజీ చెబుతున్నారు. ఆయన మరణ వార్త తమను తీవ్ర కలతకు గురిచేసిందని వాపోయారు. యలమర్రులో శ్రీహరి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. శ్రీహరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో శ్రీహరితోనే ఉంటున్నారని వారి బంధువులు వివరించారు. శ్రీహరి పెదనాన్న, పెద్దమ్మ రఘుముద్రి కోటేశ్వరరావు, లక్ష్మి మాత్రమే యలమర్రులో ఉంటున్నారు.
సికింద్రాబాద్‌లో విద్యాభ్యాసం
కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా పెదపారుపూడి మండలం యలమర్రు  గ్రామానికి చెందిన సత్యనారాయణ, శ్రీలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి బాలానగర్‌లో స్థిరపడ్డారు. వీరి రెండో కుమారుడు శ్రీహరి. సత్యనారాయణ హెచ్‌ఏఎల్‌లో సివిల్‌కాంట్రాక్టర్‌గా పనిచేసేవారు. శ్రీహరి బోయిన్‌పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలో పదవ తరగతి వరకు చదివారు. సికింద్రాబాద్‌లోని న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియెట్, సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రాంగణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదివారు. నిజాం కళాశాలలో పీజీ చేశారు. తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయకారిగా ఉండేందుకు చిన్నప్పుడు స్కూలుకు వెళ్తూనే ఇళ్లల్లో పాల ప్యాకెట్లు వేసేవారు. స్కూటర్ మెకానిక్ షెడ్డులో కూడా పనిచేశారు.
కూతురు సమాధి పక్కనే..
బాచుపల్లి గ్రామంలో శ్రీహరికి ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులోనే శ్రీహరి అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీహరి ఏకైక కూతురు అక్షర అంత్యక్రియలను కూడా బాచుపల్లిలోనే నిర్వహించారు. కూతురి మృతి తరువాత అక్షర పేరుమీద ఒక ఫౌండేషన్‌ను శ్రీహరి స్థాపించారు. ఫౌండేషన్ తరఫున రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్న అనంతారం, లక్ష్మాపూర్ గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాం ట్లను ఏర్పరిచి తాగునీటి వసతి కల్పించారు. ఆ గ్రామాల ప్రజలు శ్రీహరి అకాల మరణాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీహరి అకాల మరణంతో సినీ పరిశ్రమ కూడా దిగ్బ్రాంతికి లోనైంది. ఆయనతో తమకున్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు, కార్మికులు గుర్తుచేసుకున్నారు. నెరవేరని కల
సినీనటుడిగా తెలుగు ప్రజల హృదయాలలో చోటు సంపాదించిన రియల్‌స్టార్ శ్రీహరి రాజకీయ కల మాత్రం నెరవేరలేదు. పలుమర్లు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినప్పటికీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. దివంగత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీహరి ప్రచారం కూడా చేశారు. రానున్న ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కోరుకున్నారు. శ్రీహరి యువసేన పేరుతో స్థానికంగా ఆయనకు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి

0 comments:

Post a Comment