Monday 28 October 2013

హీరోయిన్లు తమదారికొచ్చేలా.. నిర్మాతల న్యూ రూల్స్!

చెన్నై: హీరోయిన్లను తమ దారికి తెచ్చుకునేందుకు నిర్మాతలు కొత్త నిబంధనలపై దృష్టి సారించారు. తమిళ నిర్మాతల మండలి తాజాగా హీరోయిన్లకు కొత్త రూల్స్ పెడుతూ తీర్మాణం చేసింది. ఆ రూల్స్‌కు ఒప్పుకుంటేనే హీరోయిన్లతో సినిమా అగ్రిమెంటు కుదుర్చుకుంటారు. లేకుంటే వారిని నిర్మొహమాటంగా పక్కన పెడతారు. ఇటీవల పలువురు హీరోయిన్లు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ....షూటింగ్ పూర్తయ్యాక సినిమా ప్రచార కార్యక్రమాలు, ప్రెస్ మీట్లకు హాజరవకుండా డుమ్మా కొడుతున్నారు. ఇలాంటి సంఘటనలతో విసిగిపోయిన నిర్మాతల అందరూ సమావేశమై కొన్ని కొత్త రూల్స్ ప్రతిపాదించారు. తాము నిర్మించే సినిమాలకు హీరోయిన్లు అనుకూలంగా వ్యవహరించేందుకే ఈ రూల్స్ అని చెబుతున్నారు తమిళ నిర్మాతలు.

హీరోయిన్లు తమదారికొచ్చేలా.. నిర్మాతల న్యూ రూల్స్! 
 
హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్లో 80 శాతం షూటింగ్ పూర్తయ్యే సమయానికి చెల్లించాలని, సినిమా ప్రెస్ మీట్లకు హాజరైన తర్వాత 10 శాతం, ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకున్న తర్వాత మిగతా 10 శాతం చెల్లించాలని నిర్ణయించారు. ఇలా అయితేనే హీరోయిన్లు తమ దారికి వస్తారని నిర్మాతల భావన. ఇకపై ఏ నిర్మాత అయినా...తాజాగా రూపొందించిన రూల్స్‌కు హీరోయిన్లు అంగీకరిస్తేనే వారితో అగ్రిమెంటు కుదుర్చుకోవాలని, లేకుంటే వారిని పక్కన పెట్టాలని తీర్మాణించారు. ఈ కొత్త రూల్స్‌పై తమిళ నిర్మాతల వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ రూల్స్ ఏక పక్షంగా ఉన్నాయని, ఇలాంటి రూల్స్ వల్ల కొందరు నిర్మాతలు హీరోయిన్లు చెల్లించే డబ్బు ఎగ్గొట్టే అవకాశాలుకూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

 

0 comments:

Post a Comment